AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరికాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు! ఉదయం 11.30 గంటలకు చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నైకి వెళ్లనున్నారు. రెండు గంటలపాటు జరిగే ఈ సుడిగాలి పర్యటనలో ఆయన సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. మోదీ పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పరిశీలించి మొదటి కోచ్‌లోని చిన్నారులతో, డ్రైవింగ్‌ క్యాబ్‌లోని సిబ్బందితో మాట్లాడతారు. 12.00 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు. 12.05 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సభలో పలువురు ప్రముఖులతో పాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు మోదీకి స్వాగతం పలికి ఘనంగా సన్మానిస్తారు.

అనంతరం రోడ్డు రవాణా శాఖ ప్రాజెక్టులకు, బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ నూతన భవన సముదాయానికి (వర్చువల్‌గా), సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య పూర్తి చేసిన డబ్లింగ్‌, విద్యుద్దీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మధ్య కొత్త ఎంఎంటీఎస్‌ సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. 1.30 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10