పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జమ్ము కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వ్యక్తిని మొహమ్మద్ యూసుఫ్‌గా గుర్తించారు. ఈ సంవత్సరం జూలైలో నిర్వహించిన ఆపరేషన్ మహదేవ్ సమయంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ అనంతరం ఈ అరెస్టు జరిగింది.
మొహమ్మద్ యూసుఫ్ లష్కరే తొయిబా కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతను కుల్గామ్ జిల్లాకు చెందినవాడు. రెండు రోజుల క్రితం అతనిని విచారణ కోసం పిలిచిన పోలీసులు అనంతరం అరెస్టు చేశారు. ఆపరేషన్ మహదేవ్‌లో హతమైన ఉగ్రవాదికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని శ్రీనగర్ పోలీసులు తెలిపారు.
అతను ఒక కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడని, అప్పుడప్పుడు స్థానిక పిల్లలకు బోధించేవాడని అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం అతనికి ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడటంతో వారికి సహకరించడం ప్రారంభించాడని వెల్లడించారు. పహల్గామ్ దాడికి కొన్ని నెలల ముందు కుల్గామ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ప్రయాణం చేయడానికి అతను సహకరించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు