జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక ‘కన్వర్టెడ్ సనాతని’ అని ఆయన అభివర్ణించారు. ఎన్నికలకు ముందు తన వైఖరికి, ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రదర్శిస్తున్న వైఖరికి మధ్య స్పష్టమైన తేడా ఉందని పేర్ని నాని ఆరోపించారు.
పేర్ని నాని మాట్లాడుతూ, “ఎన్నికల ముందు వరకు తనకు అన్ని మతాలు, కులాలు సమానమే అని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కాషాయ వస్త్రాలు ధరించి, తాను సనాతన ధర్మ పరిరక్షకుడినని ప్రకటించుకుంటున్నారు” అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించుకున్న ‘కన్వర్టెడ్ సనాతని’ అని నాని వ్యాఖ్యానించారు.
గతంలో పవన్ కల్యాణ్ బాప్టిజం తీసుకున్నారని, ముస్లిం మతాన్ని కూడా ఆచరించారని ఆరోపించిన నాని, ఇప్పుడు ఆ రెండింటినీ పూర్తిగా గాలికి వదిలేసి ‘కన్వర్టెడ్ సనాతని’గా మారారని ఎద్దేవా చేశారు. “ఆయనే అధికారికంగా, సిగ్గు ఎగ్గు లేకుండా డిక్లేర్ చేసేశారు కదా. ఎన్నికల ముందేమో అన్ని మతాలు ఒకటే అన్నారు, గెలిచి పదవిలోకి వచ్చాక కాషాయ బట్టలు కట్టుకుని హార్డ్ కోర్ సనాతని, కన్వర్టెడ్ సనాతని అని ఆయనే చెప్పేశారు. కాబట్టి ఆయన్ని ప్రశ్నించడానికి ఏముంది?” అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తన వైఖరిని తానే స్పష్టం చేశారని, దీనిపై ఇక చర్చ అనవసరమని నాని చెప్పారు.
