కృష్ణా నదీ తీరంలో భారీ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ నేడు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది లంక భూములను పరిశీలించారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోని పెదలంక, చినలంక భూములను పరిశీలించారు. మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దాదాపు 3 కిలోమీటర్లు నడిచి లంక భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారని వివరించారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి 2 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
కృష్ణా నది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ కమిటీలో కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు, ఇతర అధికారులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ స్పోర్ట్స్ సిటీపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.
ఇక, రాజధాని అమరావతి గురించి కూడా మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయని వెల్లడించారు. రాజధానిలో 3 వేల మంది కార్మికులు, 500 యంత్రాలు పనిచేస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి 15 వేల మంది కార్మికులు పనుల్లో పాల్గొంటారని వివరించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.