AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చాట్ జీపీటీ అదుర్స్..! 17 మంది డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును గుర్తించిన చాట్ జీపీటీ..!

వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. అమెరికాలో జరిగిన ఓ అసాధారణ సంఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపు 17 మంది వైద్య నిపుణులను సంప్రదించినా తన నాలుగేళ్ల కుమారుడికి సోకిన అరుదైన వ్యాధి ఏమిటో తెలుసుకోలేకపోయిన ఓ తల్లి, చివరికి చాట్‌జీపీటీ సహాయంతో ఆ వ్యాధిని గుర్తించడమే కాకుండా, సరైన చికిత్స అందేలా మార్గం సుగమం చేసుకున్నారు.

 

టుడే డాట్ కామ్ కథనం ప్రకారం… అమెరికాకు చెందిన కోర్ట్నీ అనే మహిళ కుమారుడు అలెక్స్, గత మూడేళ్లుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో బాలుడిలో వింత లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. తరచూ పంటినొప్పి రావడం, శారీరక ఎదుగుదల మందగించడం, నడకలో సమతుల్యత లోపించడం వంటి ఇబ్బందులను తల్లి కోర్ట్నీ గమనించారు. దీంతో ఆమె మూడేళ్ల వ్యవధిలో చిన్నపిల్లల వైద్య నిపుణులతో సహా మొత్తం 17 మంది డాక్టర్లను సంప్రదించారు. అయినా ఎవరూ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించలేకపోయారు.

 

కుమారుడి పరిస్థితి చూసి నిస్సహాయ స్థితికి చేరుకున్న కోర్ట్నీ, వినూత్నంగా ఆలోచించారు. అలెక్స్ కు సంబంధించిన అన్ని వైద్య పరీక్షల వివరాలను, ముఖ్యంగా ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్టులను, అతను ఎదుర్కొంటున్న లక్షణాలను వివరంగా చాట్‌జీపీటీలో నమోదు చేశారు. ఆశ్చర్యకరంగా, కొద్ది క్షణాల్లోనే చాట్‌జీపీటీ ఒక వ్యాధి పేరును సూచించింది. అది ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ అనే అరుదైన నరాల సంబంధిత రుగ్మత అని తెలిపింది. ఈ వ్యాధి వెన్నెముకపై ప్రభావం చూపుతుంది.

 

చాట్‌జీపీటీ సూచనపై మరింత స్పష్టత కోసం, కోర్ట్నీ ఇలాంటి లక్షణాలున్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఫేస్‌బుక్‌లో ఉన్న ఓ గ్రూప్‌లో చేరారు. అక్కడ కూడా పలువురు చాట్‌జీపీటీ చెప్పిన వ్యాధి లక్షణాలను ధృవీకరించారు. దీంతో ఆమె ఓ కొత్త న్యూరో సర్జన్‌ను సంప్రదించగా, ఆయన అలెక్స్‌కు ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ ఉన్నట్లు వైద్యపరంగా నిర్ధారించారు. అనంతరం అలెక్స్‌కు వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10