నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే ఏజేఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున వాటా ఉంది.
తాజాగా… ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో ఉన్న ఏజేఎల్ ఆస్తులను ఈడీ గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద చర్యలు చేపట్టింది. జప్తు చేయనున్న ఆస్తుల్లో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉంది. గతంలోనే ఈ ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. అయితే, ఇప్పుడు వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది.
యంగ్ ఇండియన్ సంస్థ ఏజేఎల్ ఆస్తులను ఉపయోగించి రూ.18 కోట్ల నకిలీ విరాళాలు, రూ.38 కోట్ల నకిలీ అద్దెలు, రూ.29 కోట్ల నకిలీ ప్రకటనల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ దాదాపు నిర్ధారణకు వచ్చింది. అందుకే పీఎంఎల్ఏ కింద ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
