AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుపై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

తమిళనాడు రాజకీయాల్లో కాకరేపుతున్న అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటున్నాయని అమిత్ షా నిన్న ప్రకటించడం తెలిసిందే. దీనిపై సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఈ కూటమి అధికారం కోసం ఏర్పడిందని ఆయన విమర్శించారు.

 

స్టాలిన్ ఈ పొత్తును ‘భయంతో ఏర్పడిన అవినీతి కూటమి’గా అభివర్ణించారు. కేంద్ర దాడుల నుంచి తప్పించుకోవడానికి అన్నాడీఎంకే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. “కేవలం రెండు దాడులకు భయపడి పార్టీని తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు మొత్తం తమిళనాడును తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు” అని స్టాలిన్ అన్నారు.

 

ఈ కూటమి విఫలం కావడం ఖాయమని స్టాలిన్ జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే బెదిరింపులకు లొంగిపోయిందని, తమిళ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. “అన్నాడీఎంకే ఒక పాత బానిసలా లొంగిపోయింది. బెదిరింపులతో ఈ కుట్రలను అమలు చేయడానికి ఒత్తిడి తెస్తున్నారు” అని స్టాలిన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

 

స్టాలిన్ ఈ పొత్తు సైద్ధాంతిక పునాదిని ప్రశ్నించారు. అమిత్ షా నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు ఆయన నిర్వహించే రాజ్యాంగ పదవికి తగినది కాదని విమర్శించారు. నీట్, మూడు భాషల విధానం, హిందీ రుద్దడం, వక్ఫ్ చట్టం వంటి రాష్ట్ర సమస్యలపై కూటమి వైఖరిని ఆయన వివరించలేదని స్టాలిన్ పేర్కొన్నారు.

 

“బీజేపీ విధానాలను అన్నాడీఎంకే ఇప్పుడు సమర్థిస్తుందా?” అని ప్రశ్నించారు. అమిత్ షా అన్నాడీఎంకే నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు.

 

నీట్ కు వ్యతిరేకంగా మాట్లాడటం ఒక ‘దారిమళ్లించే వ్యూహం’ అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ ఖండించారు. “నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న 20 మంది తమిళనాడు విద్యార్థులు కూడా దారి మళ్లించేందుకే అలా చేశారా?” అని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల్లో నీట్ అవకతవకలపై జరుగుతున్న సీబీఐ విచారణలపై ముందు సమాధానం చెప్పాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

 

దివంగత అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత అవినీతి కేసులను గుర్తు చేస్తూ, బీజేపీ ఇప్పుడు నైతికత గురించి ఎలా మాట్లాడగలదని స్టాలిన్ ప్రశ్నించారు. “బీజేపీ ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుంటే, అవినీతి గురించి విశ్వసనీయంగా మాట్లాడగలదా?” అని అడిగారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10