సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఏ11గా ఉన్న సినీనటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లికోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గడువు శుక్రవారంతో ముగుస్తుండటంతో తెలంగాణ హైకోర్టు నుంచి తనకు మధ్యంతర బెయిల్ మంజూరైందని విచారణ సందర్భంగా అల్లు అర్జున్ కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా ఇప్పటికే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై మెజిస్ట్రేట్ విచారణ చేపట్టారు. అయితే, కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో ఆయన కేసు తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.
వర్చువల్‌గానే హాజరు..
నాంపల్లి కోర్టుకు అల్లుఅర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. అసలు అల్లు అర్జున్ స్వయంగా కోర్టు ముందు హాజరవుతారని అనుకున్నారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది.
కౌంటర్ దాఖలుకు పీపీ సమయం కోరడంతో..
కౌంటర్ దాఖలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరగా.. తదుపరి విచారణను ఈ నెల 30కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ కేసులో ఇటీవల అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అప్పుడే అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అది శుక్రవారంతో ముగియనుండటంతో కోర్టు విచారణ జరిపింది.
ఏం జరిగిందంటే?
కాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వెంటనే బెయిల్ విషయంలో హైకోర్టును ఆశ్రయించగా.. 4వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ చంచల్‌గూడ జైలు నుంచి ఆ రాత్రే బయటకొచ్చేసారని అంతా అనుకున్నారు. కానీ మధ్యంతర బెయిల్ మంజూరు కాపీ తమకు ఇంకా అందలేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆ రాత్రంతా బన్నీని జైలులోనే ఉంచారు. మరుసటి రోజు విడుదల చేశారు.
…….