కామారెడ్డి: జిల్లాలో ముగ్గురి ఆత్మహత్యల కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్, ఓ యువకుడి ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సెల్ ఫోన్ డాటా, వాట్స్ ఆప్ చాటింగ్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురి బంధువులు, స్నేహితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ముగ్గురి పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయి. ఇద్దరు పోలీసుల, ఓ యువకుడి ఆత్మహత్య రహస్యాన్ని చేధించేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ సీఐ సంతోష్, ఎస్సై రంజిత్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్న ఉదయం 11 గంటలకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బైక్‌పై బీబీపీట నుంచి బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. నిఖిల్ తన బైక్‌ను ఎక్కడ పెట్టాడనేది తేలాల్సి ఉంది.
అలాగే ఎస్ఐ సాయికుమార్ భార్య వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఇవాళ ఎస్ఐ సాయికుమార్ స్వగ్రామం మెదక్ జిల్లా కొల్చారంకు దర్యాప్తు బృందం వెళ్లి సమాచారాన్ని సేకరించనుంది. భిక్కనూరు, కామారెడ్డి, బిబిపేట, అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలోని హోటల్‌లలో సీసీ ఫుటేజ్‌లను దర్యాప్తు బృందం పరిశీలించనుంది. వారి ఆత్మహత్యకు కారణాలేంటి.. ప్రేమ వ్యవహారమా?..లేక వివాహేతర సంబంధమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.