కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కాగా, జనగణనలో కులగణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు.
దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయన్నారు. జనాభా ప్రాతిపాదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు.
చట్ట సభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశపెట్టి ఒక కొలిక్కి తీసుకొచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై మనం ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. మహిళా బిల్లుతో బీజేపీ వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణనలో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.