సంధ్య థియేటర్ ఘటనపై సీపీఐ నారాయణ
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం.. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సినిమా రిలీజ్ అయిన రోజే థియేటర్ వద్దకు కుటుంబంతో సహా వెళ్లి అల్లు అర్జున్ తొక్కిసలాటకు కారణమయ్యారనే చర్చ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ కూడా స్పందించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై స్పందిస్తూ సీపీఐ నారాయణ ఓ వీడియో విడుదల చేశారు.
ఇందులో ఆయన తొలుత తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇచ్చిన అనుమతిని సైతం తప్పుబట్టారు. అయితే సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ నారాయణ కోరారు. ఇదేమీ సమాజానికి ఉపయోగపడే సినిమా కాదని, ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని నారాయణ వ్యాఖ్యానించారు.
‘ సంధ్య థియేటర్ ఘటనలో పోలీసుల తప్పేం లేదని సీపీఐ నారాయణ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు జరగకుండా సినీ ఇండస్ట్రీ, ఆర్టిస్టులు, రాజకీయ నేతలు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, త్వరలో తమ పార్టీ తరఫున కూడా సాయం ప్రకటిస్తామని నారాయణ తెలిపారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వం అల్లు అర్జున్ పై సీరియస్ అవుతున్న నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.