AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

పుష్ఫ-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు శనివారం రాత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయం లేకుండా శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

అయితే, బాలుడికి అప్పుడప్పుడు జ్వరం వస్తోందని.. శుక్రవారంతో పోల్చితే నేడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడని చెప్పారు. కాగా, శ్రీతేజ్ కళ్లు తెరిచాడని.. అయితే ఎవరినీ గుర్తు పట్టడం లేదని శుక్రవారం వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే.

మరోవైపు, శ్రీతేజ్ వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై చర్చ జరిగిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ నుంచి నేరుగా కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వ్యక్తిగతంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల సాయం ప్రకటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10