అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 (Pushpa 2). ఈ సినిమా ఎంత విజయాన్ని అయితే సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా సాధించి పెట్టిన విజయాన్ని అల్లు అర్జున్ అనుభవించలేకపోతున్నారు. దీనికి కారణం ఆయనే అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో పుష్ప2 సినిమా బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూడడానికి ఆయన కార్ లో సైలెంట్ గా వచ్చి ఉండి ఉంటే సినిమా సాఫీగా చూసేవారు. అలాగే ఎవరికి ఏ ఇబ్బంది కలిగేది కాదు. కానీ ఆయన ఎప్పుడైతే ర్యాలీ చేసుకుంటూ జనాల్లోకి వచ్చారో అప్పుడే అసలు విధ్వంసం మొదలయ్యింది.
ముఖ్యంగా అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహిస్తూ రావడంతో అభిమానులు ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. దీనికి తోడు ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు బ్రెయిన్ డ్యామేజ్ కావడంతో హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంత జరిగినా సరే అల్లు అర్జున్ సహాయం చేస్తానని చెప్పాడు కానీ దీనిపై పూర్తిగా స్పందించకపోవడంతో ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మానవత్వం కూడా లేదా అంటూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
సంధ్య థియేటర్ ఘటనలో ఒక ప్రాణం పోవడం, ఆ టైంలో అల్లు అర్జున్ బాధ్యతరహితంగా ప్రవర్తించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. “ఇకపై మేం అధికారంలో ఉన్నంతవరకు సినిమా వాళ్ళ ఆటలు సాగవు. టికెట్ ధరల పెంపు కానీ బెనిఫిట్ షోలు కానీ ఇక ఉండవు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి. కానీ ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే మాత్రం ఊరుకోము” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అంటూ అటు అభిమానులు, ప్రజలు కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.