భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ముర్ము.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై ప్రసంగించారు. గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ కారణంగా అత్యంత రహస్యంగా ఉండాల్సిన తెలంగాణలోని రైతులకు సంబంధించిన భూ రికార్డులతో పాటు సమస్త సమాచారం దేశం ఎల్లలు దాటిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా 2020 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబర్, టెలిఫోన్ నంబర్‌తో సహా అన్ని వివరాలు కళ్లకు కట్టినట్టుగా పరాయిల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు.