AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ రంగంలోకి దిగిన హైడ్రా.. ఆ ప్రాంతంలో అధికారుల సర్వే పూర్తి..

హైదరాబాద్‌లోని చెరువుల కబ్జాలపై హైడ్రా స్పెషల్‌ ఫోకస్‌ పెడుతోంది. వరుస ఫిర్యాదులతో మళ్లీ రంగంలోకి దిగింది. తాజాగా.. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ కంట్లూర్‌లో హైడ్రా యాక్షన్‌ షురూ చేసింది. కంట్లూర్‌ పెద్దచెరువు కబ్జాకు గురవుతుందని హైడ్రాకు కొందరు ఫిర్యాదు చేశారు. కంట్లూర్‌కు చెందిన కొందరు చెరువు కబ్జా చేసి రోడ్డు వేశారని.. దీనిలో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తముందని కంప్లైంట్‌ చేయడంతో హైడ్రా అధికారులు చెరువు దగ్గర వాలిపోయారు. భారీ బందోబస్తు మధ్య కంట్లూర్‌ పెద్దచెరువు సర్వే చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

మరోవైపు.. హైదరాబాద్‌లో చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతోన్న పలు కంపెనీలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో రంగనాథ్‌ను కలిసిన ఆయన.. పలు కంపెనీల పేర్లను ప్రస్తావిస్తూ కంప్లైంట్‌ ఇచ్చారు. ముఖ్యంగా.. హైదరాబాద్‌లో ఐదు ప్రముఖ కంపెనీలు ఇష్టారీతిన చెరువుల్లో నిర్మాణాలు చేస్తున్నాయని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వంలో ఆ కంపెనీలకు అక్రమాలకు సహకరించిన మంత్రులు, అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో అక్రమాల్లో ఈ ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే అసెంబ్లీలో గళం విప్పుతామన్నారు వెంకటరమణారెడ్డి.

ఇప్పటికే.. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, పార్కుల ఆక్రమణపై ప్రజల నుంచి పెద్దయెత్తున ఫిర్యాదులు వస్తుండడంతో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుంచి ప్రజావాణిలో ఫిర్యాదులు తీసుకోవాలని డిసైడ్‌ అయింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10