AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవులకు రూ. కోటి నగదు.. 300 గజాల ఇంటి స్థలం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో  సోమవారం రాత్రి   తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ తల్లి ప్రతిరూపమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చినా.. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.

భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా తల్లితోనే గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నప్పుడు తన తల్లి ఎలా ఉందో.. ఇపుడు కూడా తెలంగాణ తల్లి అలానే ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు… అవమానించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారని దుయ్యాబట్టారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తమ సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసిందని తెలిపారు. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. ఈ తొమ్మిది మంది కవులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు రూ. కోటి నగదు, తామ్ర పత్రం అందిస్తామని రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

కొంతమందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండొచ్చని.. వాళ్ల రాజకీయ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరమని వాళ్లు అనుకోవచ్చన్న రేవంత్ రెడ్డి.. కానీ ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ సాధించుకోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతా తెలంగాణలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యామన్నారు. ఇక అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఉండకూడదని ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10