రిక్టర్ స్కేల్‌పై 3.1 నమోదు
భయాందోళనకు గురైన జనం
తెలంగాణలో మళ్లీ భూమి కంపించింది. ఇంతకు భూమిలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. మొన్నటికి మొన్న భూకంపం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది. జనం చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపాల్సి వచ్చింది. కంపించింది కొన్ని సెకెన్ల పాటే అయినప్పటికీ దాని ప్రభావం జనంపై తీవ్రంగా పడింది. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. ములుగు జిల్లాలో భూకంప తీవ్రత అధికంగా కనిపించింది. రిక్టర్ స్కేలుపై 5.3గా రికార్డయింది. ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. అదే సమమయంలో ఏపీ, తెలంగాణల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల రెండు సెకెన్ల పాటు భూమి ప్రకంపించింది.
తాజాగా మరోసారి..
‘ఏపీలో కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత రెండు సెకెన్ల పాటు కొనసాగింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా వేర్వేరు జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దీని తీవ్రత 3 నుంచి 4 సెకెన్ల పాటు కనిపించింది. ఇప్పుడు తాజాగా మరోసారి భూమి కంపించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. శనివారం మధ్యాహ్నం సరిగ్గా 12ః10 నిమిషాలకు భూకంపం సంభవించింది. జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరిపల్లి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. తాజా ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా రికార్డయింది. భూమి కంపించిన వెంటనే జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకి పరుగులు తీశారు. చాలాసేపటి వరకు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.