AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘సంధ్య’ ఘటనపై అల్లు అర్జున్ ఎమోషనల్.. రేవతి ఫ్యామిలీకి రూ.25 లక్షల సాయం

పుష్ప-2 సినిమా ప్రీమియర్ సందర్భంగా.. డిసెంబర్ 04వ తేదీన హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ఎమోషనల్ వీడియో విడుదల చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడి పరిస్థితి ఇప్పటికి కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు.

ఈ క్రమంలో.. రేవతి మరణంపై అల్లు అర్జున్ స్పందించారు. ఆమె కుటుంబానికి అల్లు అర్జున్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. రేవతి మరణం తమను ఎంతగానో కలిచివేసిందని.. ఆమె కుటుంబానికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన వంతుగా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆమె పిల్లలకు ఎలాంటి సాయం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్టు బన్నీ హామీ ఇచ్చారు. తాను చేస్తున్న ఈ ఆర్థిక సాయం కేవలం.. తాను అండగా ఉన్నానని చెప్పేందుకేనని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్.

“అందరికీ నమస్కారం. మొన్న మేం పుష్ప సినిమా ప్రీమియర్స్‌కి వెళ్లినప్పుడు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కి వెళ్లాం. అక్కడికి వెళ్లినప్పుడు అనుకోకుండా.. క్రౌడ్ టర్న్‌ అవుట్ అవటం వల్ల.. సినిమా చూసి వచ్చిన తర్వాతి రోజు పొద్దున.. ఆ క్రౌడ్‌లో ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీ దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా.. ఇద్దరు పిల్లల తల్లి అయిన రేవతి.. ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి చనిపోయారని తెలిసింది. ఆ వార్త తెలియగానే నేను, సుకుమార్‌తో పాటు మొత్తం పుష్ప టీం అంతా షాక్‌లోకి వెళ్లాం. ఎందుకంటే.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. లాస్ట్ 20 ఏళ్లుగా అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసి రావటం ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగలేదు. సడెన్‌గా ఇలా జరిగేసరిగా చాలా డిసప్పాయింట్ అయ్యాం.

రేవతి కుటుంబానికి నా తరఫున, పుష్ప టీం తరపున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా. మేం ఎంత చేసినా.. ఏం చేసినా.. ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం. కానీ.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. మాకున్న శక్తిలో మీకు ఎలా కావాలన్నా.. ఏం కావాలన్నా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. నా తరపు నుంచి రూ. 25 లక్షలు సాయంగా ప్రకటిస్తున్నా. ఈ ఆర్థిక సాయం కూడా నేను మీకోసం ఉన్నాను అని చెప్పేందుకు.. వాళ్ల ఫ్యామిలీ భవిష్యత్తు బాగుండాలని, ఎంతో కొంత ఉపయోగపడుతుందని. ప్రత్యేకంగా వాళ్లకు పిల్లలున్నారు. వాళ్లకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా.. నావంతుగా నేను చేస్తాను. వైద్య ఖర్చులు కూడా మేమే భరిస్తాం. ఇలాంటి సమయంలో ఆ కుటుంబం ఎంతగా సఫర్ అవుతుందో అర్థం చేసుకోగలను.. అందుకే నా తరపున, నా టీం తరపును అన్ని విధాలుగా సపోర్టు ఉంటుంది. అంటూ ఎమోషనల్‌ వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10