AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పుష్ప 2 థియేటర్‌లో  విషపూరితమైన రసాయనాలు స్ప్రే!.. ముంబైలో ఘటన.. కేసు నమోదు

ఐకన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2– ది రూల్‌ సినిమా ప్రదర్శన సందర్భంగా ముంబైలోని ఓ సినిమా థియేటర్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు విషపూరితమైన రసాయనాలను స్ప్రే చేశారని ప్రేక్షకులు వెల్లడించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 20– 25 నిమిషాల పాటు సినిమా ప్రదర్శనను సైతం నిలిపివేయాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం ముంబైలోని ప్రఖ్యాత గెయిటీ గెలాక్సీ థియేటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై బాంద్రా ఏరియాలో ఉంటుందీ సినిమా హాల్‌. విశ్రాంతి సమయంలో హాలులో ప్రేక్షకుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్ప్రే చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

విరామ సమయం తరువాత..
‘ విశ్రాంతి తరువాత షో పడినప్పుడు హాలులోనికి వెళ్లిన వాళ్లల్లో చాలామంది ప్రేక్షకులు ఘాటు వాసనతో ఇబ్బందులకు గురయ్యారు. విపరీతమైన దగ్గుతో బాధపడ్డారు. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులకు లోనయ్యారు. చాలామంది దగ్గతూ తలుపులు తోసుకుంటూ బయటికి రావడం కనిపించింది. విశ్రాంతికి ముందు లేని ఘాటు వాతావరణం ఆ తరువాత కనిపించిందని దీన్‌ దయాళ్‌ అనే ప్రేక్షకుడు తెలిపాడు. కొందరు వాంతులు సైతం చేసుకున్నారని అన్నాడు. దీనితో థియేటర్‌ యాజమాన్యం సినిమా ప్రదర్శనను 20 నిమిషాల పాటు నిలిపివేసిందని, తలుపులన్నీ తెరవడంతో ఘాటు వాసన తీవ్రత తగ్గిందని వివరించాడు.

ఇంటర్వెల్ తరువాత హాలులోనికి వెళ్లిన చాలామంది ప్రేక్షకులు ముఖానికి కర్చీఫ్‌ను కట్టుకోవడం కనిపించింది. వాళ్లందరూ ఒక్కసారిగా లేచి నిల్చోవడం, దగ్గడం, మరికొందరు తలుపులు తోసుకుంటూ బయటికి వెళ్లారు. 20 నుంచి 25 నిమిషాల తరువాత సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత సినిమా ప్రదర్శన కొనసాగింది.

ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఉదయం వారు గెయిటీ గెలాక్సీ థియేటర్‌కు వచ్చారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా? అంటూ ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10