AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్యూషన్‌ మాస్టర్‌ టూ టీజీపీఎస్సీ చైర్మన్‌.. బుర్రా వెంకటేశం ఇన్సిపిరేషనల్‌ జర్నీ

ఎందరికో ఆదర్శం

సీనియర్‌ ఐఏఎస్‌ బుర్రా వెంకటేశం.. ఇన్సిపిరేషనల్‌ జర్నీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. టీజీపీఎస్సీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన వెంకటేశం నిరుపేద కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కష్టాలను అధిగమించి, కన్నీళ్లను దిగమింగి అనుకున్నది సాధించారు. తల్లిదండ్రుల ఆశయాలు, గురువు చూపిన మార్గంలో నడిచి తిరుగులేని విజయాలు సాధించిన ఆయన ప్రయాణం ఎందిరికో స్ఫూర్తి.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ చైర్మన్‌ (టీజీపీఎస్సీ)గా సీనియర్‌ ఐఏఎస్‌ బుర్రా వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి పదవీకాలం డిసెంబర్‌ 3న ముగియనుండగా.. అదే రోజు వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశం వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ హోదాలోనే ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయనుండగా.. అనంతరం టీజీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తి కాలం అంటే 2030 వరకు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగనున్నారు.

వెంకటేశం జర్నీ..
తెలంగాణలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన బుర్రా వెంకటేశం జర్నీ ఎందరికో ఆదర్శం. రెండో తరగితి చదివే సమయంలోనే తండ్రి చనిపోయినా.. తల్లి కష్టంతో సర్కారు బడిలో చదివి ఆయన ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. జనగామ మండలం ఓబుల్‌ కేశవాపూర్‌లో 10 ఏప్రిల్‌ 1968లో వెంకటేశం జన్మించారు. తల్లిదండ్రులు బుర్రా గౌరమ్మ, నారాయణలది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. రెండో తరగతిలో ఉండగానే వెంకటేశం తండ్రి చనిపోయారు. తల్లి కష్టంతో గ్రామంలోనే ఏడో తరగతి వరకు చదువుకున్నారు.

సర్కారు బడిలోనే చదులువులు..
వరంగల్, నల్గొండ జిల్లాల్లో సర్కారు బడిలోనే పదో తరగతి పూర్తి చేసిన వెంకటేశం.. ఇంటర్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ అంబేడ్కర్‌ కాలేజీలో డిగ్రీ, ఓయూ నుంచి పీజీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. షేక్‌పేట్‌ పరిధిలో హోమ్‌ ట్యూషన్స్‌ చెబుతూనే విద్యా బోధన సాగించారు. తన గురవు మొహిసినొద్దీన్‌ ఇచ్చిన స్ఫూర్తితో ఐఏఎస్‌ కావాలనే లక్ష్యం ఏర్పడింది. ఓ వైపు ఉద్యోగాలు చేస్తూనే తాను అనుకున్నది సాధించారు. 1990లో మెుదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ రాసి సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం పొందారు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 1995లో సివిల్స్‌ రాసి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు.

ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా..
1996లో ఆదిలాబాద్‌ జిల్లా ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా ఆయన తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ నుంచి పలు జిల్లాల్లో కలెక్టర్‌గా, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సేవలందించారు. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా, రాష్ట్ర గవర్నర్‌కు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహస్తున్నారు. ఆయనకు తెలుగు, ఆంగ్లంతో పాటు ఉర్దూ, స్పానిష్, జపనీస్‌ భాషల్లో పట్టుంది. కవి, రచయితగాను పేరుంది. 2019లో ఆయన రాసిన సెల్ఫీఆఫ్‌ సక్సెస్‌ అమెజాన్‌ లో అమ్మకాల రికార్డును సృష్టించింది.

ఎంత ఎదిగినా..
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం వెంకటేశానిది. అందుకే పుట్టిన నేలకు తనవంతుగా ఏదైనా చేయాలని పరితపించారు. గ్రామంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తనతో పాటు దాతల భాగస్వామ్యంతో అద్భుతంగా నిర్మించారు. ప్రతి రోజూ పూజలు, ఏటా ఉత్సవాలను ఘనంగా జరిపిస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10