ఏటూరు నాగారం అడవుల్లో తుపాకుల మోత
మృతుల్లో కీలక నేతలు?
వరుస ఎన్కౌంటర్లతో నక్సల్స్‌కు పెద్దదెబ్బ
తెలంగాణ అడవుల్లో మరోసారి తుపాకీ తూటాలు పేలాయి. ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టగా.. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. ఏడుగురు నక్సల్స్ మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు ఉన్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు.
మృతుల్లో వీరు..
మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇల్లందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35)తోపాటు అతని దళ సభ్యులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఏటూరునాగారం మహదేశ్‌పూర్ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23) ఉన్నారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పెద్ద మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. 14 ఏండ్ల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది అతిపెద్ద ఎన్ కౌంటర్ కావడం విశేషం. కొంతకాలంగా వరుస ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్‌ను కోల్పోతున్నది.
గత సెప్టెంబర్‌లోనూ..
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి–ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు అడవిలో కూబింగ్ చేపట్టగా… వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
నక్సల్స్‌కు ఎదురు దెబ్బే..
తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు అంతగా లేవనే చెప్పొచ్చు. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు హతం కాలేదు. సెప్టెంబర్‌లో ఆరుగురు, ప్రస్తుతం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందటం నక్సల్స్‌కు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలను అలర్ట్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.
ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు హతమయ్యాడు.