మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గోండియా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భండారి నుంచి గోండియా వెళ్తున్న బస్సుకు కోహ్‌మారా హైవేపై ఓ బైక్ ఎదురొచ్చింది. ఆ బైకును తప్పించే క్రమంలో డ్రైవర్ దాన్ని మరోవైపునకు తిప్పాడు.
ఒక్కసారిగా బస్సును మలుపుతిప్పడంతో బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోస్సు బోల్తా పడిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.