రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ విన్నపం
తెలంగాణలో కీలక అధికారిగా పనిచేశానంటూ వినతి
తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు వేడుకోలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు. లేటెస్ట్‌గా ఆయన యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. దీన్ని పసిగట్టిన కొంతమంది నేతలు, తెర వెనుక నుంచి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇండియాకు రాకుండా ఉండేలా పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే గ్రీన్‌కార్డు ..
ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డు దక్కించుకున్న ప్రభాకర్‌రావు, మరో అడుగు ముందు కేశారు. ఈ క్రమంలో యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో కీలక సారాంశం ఏంటంటే.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పని చేశానని ప్రస్తావించారు. రాజకీయంగా తనను అక్కడి ప్రభుత్వం వేధిస్తుందని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని, ఫ్లోరిడాలో తన కుమారుడి వద్ద ఉంటున్నానని రాసుకొచ్చారు.
ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు..
ప్రభాకర్‌రావు దరఖాస్తుపై అమెరికా ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి. లేదంటే భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందా? అనేది చూడాలి. మరోవైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావుని ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖతో మంతనాలు జరుపుతోంది. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.