తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తుండగా.. రైతులంతా కల్లాల దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు తీపికబురు వినిపించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం (నవంబర్ 26న) రోజు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని.. రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని… గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని వివరించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని.. ధాన్యం విక్రయించిన తర్వాత త్వరితగతిన రైతుల అకౌంట్లలో ధాన్యం డబ్బులు జమ చేయాలని, సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇంఛార్జి మంత్రులు, ఇంఛార్జి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. ధాన్యం కొనుగోళ్ల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని ఆదేశించారు. మిల్లులకు ధాన్యం తరలించేందుకు లారీల ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సన్నరకం వడ్లు పండించిన రైతులకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. అదే విధంగా మిగతా రైతులకు కూడా వెంటనే డబ్బులు చెల్లించటం వల్ల వాళ్లు కూడా సంతోషం వ్యక్తం చేసినవారిమవుతామని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.