భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అబ్బయ్య.. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన స్వగ్రామం ఇల్లందు మండలం సుదిమల్ల. అబ్బయ్య మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1983లో బూర్గంపాడు నుంచి అబ్బయ్య ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 2009లో ఇల్లందు నుంచి విజయం సాధించారు. అబ్బయ్య ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి ఓసారి, ఇల్లందు ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్ సహా.. పలువురు నేతలు సంతాపం తెలిపారు.
సీపీఐ నుంచి రాజకీయాల్లోకి..
ఊకే అబ్బయ్య సీపీఐ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారిగా 1985లో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1999లో ఇల్లందు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరపున ఇల్లందు నుంచే పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సీఎం రేవంత్ సంతాపం..
అబ్బయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘గిరిజన నాయకులు, శాసనసభ మాజీ సభ్యులు ఊకే అబ్బయ్య గారి మృతి బాధాకరం. అబ్బయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఊకే అబ్బయ్య ఉమ్మడి రాష్ట్రంలో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి ఒకసారి, ఇల్లందు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు అమూల్యమైన సేవలందించారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.