తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డిని లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని.. పోలీసులు ఎప్పుడు వచ్చి ఏం చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
న్యాయం చేయాలి
తమ భూమి విషయంపై తొమ్మిది నెలల నుంచి ధర్నాలు చేస్తున్నామని లగచర్ల ఫార్మా బాధితులు అన్నారు. 500 మంది పోలీసులు వచ్చి తమను కొట్టారని లగచర్ల ఫార్మా బాధితులు అన్నారు. అందరినీ జైలుకు పట్టుకుపోయారని చెప్పారు. తాము భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ వారిని విడిచిపెట్టాలని కోరారు. తమకు న్యాయం చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి ఇలా చేస్తాడని తాము ఊహించలేదని లగచర్ల ఫార్మా బాధితులు ఎన్‌హెచ్‌ఆర్సీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
దౌర్జన్యంగా లాక్కునే యత్నం.. సత్యవతిరాథోడ్
లగచర్ల ఘటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను సోమవారం ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతుల జీవనాధారంగా ఉన్న భూమిని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం రేవంత్ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. దీనిని అడ్డుకునే క్రమంలో స్థానిక యువత అధికారులను అడ్డుకున్నారని… కొంత ఘర్షణ జరిగిందని చెప్పారు. దీన్ని ఓ సాకుగా చూపుతూ గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అక్రమ కేసులు..
చాలామందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇప్పటికీ గ్రామస్తులను బెదిరిస్తున్నారని చెప్పారు. వీటిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై ఆదివాసీ బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే ప్రయత్నం చేస్తున్నామని సత్యవతి రాథోడ్ అన్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. ఈమేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ , జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై ఫిర్యాదు చేశామని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.