నారావారిపల్లెకు చేరుకున్న రామ్మూర్తి నాయుడి భౌతికకాయం
పలువురి ప్రముఖుల నివాళి
తన సోదరుడు రామ్మూర్తినాయుడి భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. నారావారిపల్లెలో సీఎం, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, మంత్రి లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మోహన్‌బాబు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. ఏఐజీ హాస్పిటల్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రామ్మూర్తినాయుడి భౌతికకాయం చేరుకుంది. దగ్గరుండి తన చిన్నాన్న భౌతికకాయాన్ని నారావారిపల్లెకు మంత్రి నారా లోకేష్ తరలించారు.
ప్రత్యేక విమానంలో..
ప్రత్యేక విమానంలో నారా రామ్మూర్తి నాయుడు పార్థీవదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి నారా లోకేశ్ తీసుకువచ్చారు. 7: 45గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానం చేరుకుంది. 9 గంటలకు నారావారిపల్లిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటికి రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహం తరలించారు. నారా లోకేష్‌తో పాటు నారా, నందమూరి కుటుంబాలు, పార్టీ శ్రేణులు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. నారావారిపల్లెలోని నారా రామ్మూర్తి నాయుడు అమ్మానాన్నలు సమాధులు ఉన్న చోటే నారా రామూర్తి నాయుడుకి అంతిమ సంస్కారాలు చేయనున్నారు.
ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూత..
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. దీంతో పరిస్థితి పూర్తిగా విషమించి తుదిశ్వాస విడిచారు.