నాకు రూ.14 కోట్లు ఇవ్వాలి
ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఓ బాధితుడు ఆరోపించారు. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొని తనకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వట్లేదన్నది బాధితుడి ఆవేదన. ఇంతకీ ఆ బాధితుడు ఎవరు? ఎక్కడ? అనే విషయాలు తెలుసుకుందాం.
బాధితుడి పేరు కళ్లెం నర్సింహారెడ్డి.. వయస్సు 87 ఏళ్లు. హైదరాబాద్‌లోని దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన రైతు. దగ్గరి బంధువే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారని ఆరోపించాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండలం, యాడారం గ్రామంలో సర్వే నంబర్ 249, 250 ఏలో 23 ఎకరాల 26 గుంటల భూమిని 1982లో భూమిని కొనుగోలు చేశాడు ఆ రైతు. అయితే ఈ భూమిని తాను కొంటానంటూ బంధువుల ద్వారా పలుమార్లు మల్లారెడ్డి అడిగారని తెలిపాడు.
తొలుత మొత్తం భూమి కొనుగోలు చేస్తానని చెప్పిన మల్లారెడ్డి, చివరకు 9.29 ఎకరాలు కొనుగోలు చేస్తానని అన్నాడని తెలిపాడు. ఒక్కో ఎకరానికి రూ.2.25 కోట్లు చొప్పున 9.29 ఎకరాలకు మొత్తం రూ. 21.88 కోట్లకు డీల్ కుదిరింది. అందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా జరిగింది.
విడతల వారిగా రూ. 8.03 కోట్లు చెల్లించారట మల్లారెడ్డి. మిగతా 14 కోట్లు చెల్లించలేదని, అడిగితే తర్వాత ఇస్తానంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. కొడుకు మహేందర్‌రెడ్డి కంపెనీ సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఆ సమయంలో 14 కోట్లకు సంబంధించి చెక్కులు ఇచ్చారన్నాడు బాధితుడు. ఆ చెక్కులు చెల్లలేదన్నది బాధితుడి మాట. గత 40 రోజులుగా డబ్బు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తన గోడు వెలిబుచ్చారు కళ్లెం నర్సింహారెడ్డి. దీనిపై మల్లారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.