లగచర్ల ప్రజల తరపున తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని, తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. తెలంగాణ భవన్లో లగచర్ల బాధిత మహిళలతో కేటీఆర్ సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డికి తానంటే చాలా ప్రేమ ఉన్నట్లు ఉందని.. అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కొడంగల్‌లో జరిగిన ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని.. కావాలనే తమపై ప్రభుత్వం డైవర్షన్ చేస్తుందని మండిపడ్డారు. లగచర్ల భూసేకరణలో తీవ్రంగా భంగపడిన ప్రభుత్వం కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని ధ్వజమెత్తారు.
సురేశ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్తలేనని.. ఆయనకు 7 ఎకరాల భూమి ఉందని కేటీఆర్ తెలిపారు. లగచర్ల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లినట్లు వెళ్లారని కేటీఆర్ మండిపడ్డారు. హరగోపాల్, కోదండరాం లాంటి వారు కనీసం ఈ ఘటనపై మాట్లాడటం లేదన్నారు.
మావోయిస్టులు స్పందించారు కానీ.. ఎవరూ మాట్లాడటం లేదన్నారు. ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అని రేవంత్ రెడ్డి మాటలు చెబుతున్నారు.. కానీ, అవి సాధ్యం కాదన్నారు కేటీఆర్. కొడంగల్ ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి తన సొంత నియోజకవర్గంపై కూటా పట్టులేదన్నారు. తాము సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా? అని ప్రశ్నించారు. వీళ్లకు ప్రభుత్వం నడపడం చేతకావడం లేదని రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పించారు కేటీఆర్.