అన్ని రకాలుగా వెనుకబడిన వికారాబాద్ జిల్లా కొడంగల్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే అభివృద్ధిని అడ్డుకునేందుకు ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే దాడి చేయిస్తే.. తాము వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రపంచంతో పోటీ పడాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్న భట్టి.. పరిశ్రమలు రావాలంటే భూ సేకరణ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి భూసేకరణ అవసరమని పేర్కొన్న భట్టి విక్రమార్క.. ఈ సందర్భంగా భూమి కోల్పోతున్న రైతుల బాధ తమ ప్రభుత్వానికి తెలుసు అని వెల్లడించారు. రైతుల బాధను ఇందిరమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుందని.. భూమి కోల్పోతున్న వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లు కోల్పోతున్న వారికి మంచి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తున్నామని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కావాలనే కుట్రపూరితంగా కలెక్టర్‌పై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడి చేశాయని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి వారిని దాడికి ఉసిగొల్పారని.. కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సమస్యకు పరిష్కారం దాడులు కాదని.. కలెక్టర్‌తో చర్చించి పరిష్కరించుకోవాలని భట్టి సూచించారు.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన నడుస్తోందని.. ఇందిరమ్మ రాజ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో పరిశ్రమలు రావడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదా అని భట్టి ప్రశ్నించారు. ఇది బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేయాల్సిన పని కాదని చెప్పారు. ప్రాజెక్టుల కోసం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. చాలా భూసేకరణ చేశారని.. అప్పుడు ఏనాడూ తాము అందుకు అడ్డుతగలలేదని.. కాదనలేదని గుర్తు చేశారు.