AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పిల్లల్లో నైతిక విలువలు పెంపొందిస్తా.. – చాగంటి కోటేశ్వరరావు

ఈ ఒక్క కారణంతోనే పదవిని తీసుకున్నా
(మహా, అమరావతి):
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. క్యాబినెట్‌ ర్యాంకుతో ఈ పదవిని ప్రభుత్వం చాగంటికి కట్టబెట్టింది. 2016లో ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం, 2023లో మరోసారి వైసీపీ ప్రభుత్వం పదవి ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన నిరాకరించారు. ఈసారి మాత్రం తీసుకున్నారు. అందుకు కారణాన్ని చాగంటి వివరించారు. తన వయసు ఇప్పుడు 65 సంవత్సరాలని, ఆరోగ్యంగా తాను ఏం చేయగలిగినా మరో ఐదారు సంవత్సరాలకు మించి చేయలేనని అందుకే ఈ సమయంలో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పదవిని స్వీకరించినట్లు చెప్పారు.

ఇదొక్కటే కారణం
ఈ ఐదారు సంవత్సరాల్లో అన్నివేల మంది పిల్లలను తాను కూర్చోబెట్టలేనని, ప్రభుత్వమే కూర్చోబెడితే పిల్లలకు నాలుగు మంచి మాటలు చెబుతానని, అంతకుమించిన సంతోషం తనకు ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పగించిన ఈ కర్తవ్యాన్ని స్వీకరిస్తున్నానని, పదవిని తీసుకోవడానికి ఇదొక్కటే కారణమని చాగంటి వెల్లడించారు. ఒకరకంగా ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, తల్లిదండ్రులు గర్వించేలా వారిని రూపొందించడం, దేశభక్తిని పెంచేలా ప్రవచనాలివ్వడం అనేది ఒక బృహత్తరమైన అవకాశం అన్నారు.

పిల్లల్లో ప్రతిభను గుర్తించాలి..
పిల్లల్లో ఉన్న ప్రతిభను చిన్నతనంలోనే తల్లిదండ్రులు గుర్తించాలని, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచనా ప్రతిభను ఆయన తండ్రి గుర్తించారని, బాలమురళీకృష్ణ సంగీత ప్రతిభను కూడా తల్లిదండ్రులు గుర్తించారని, సచిన్‌ టెండూల్కర్‌ స్ట్రైట్‌ డ్రైవ్‌ ఆడటంలోని నైపుణ్యాన్ని అతని తండ్రి, అన్న గుర్తించి ప్రోత్సహించారన్నారు. ఎందరో మహనీయులు జన్మించిన ఈ భూమిమీద, వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత భవిష్యత్తును రూపొందించుకోవాలని, అందరికీ సాయం చేస్తూ, సంయమనం, నిగ్రహం ఉన్నవారు దేశానికి ఉపయోగపడతారన్నారు. ఏ రంగంలోనైనా నిబద్ధత, నైతిక విలువలు పాటించాలని, వాటిని చిన్నతనం నుంచే విద్యార్థులకు అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. ఏ వస్తువు ఎంతవరకు ప్రయోజనమో అంతవరకే ఉపయోగించాలని, ఆ విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజేయడం చాలా కీలకమని చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ANN TOP 10