AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డి ప్రయాణంపై ‘ఒకే ఒక్కడు’ పుస్తకం.. బర్త్‌డేకు సీఎంకు అరుదైన కానుక..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా టీపీసీసీ అరుదైన కానుకను ఆవిష్కరించింది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై.. వేణుగోపాల్ రెడ్డి, విజయార్కే కలిసి “ఒకే ఒక్కడు.. ఎనుముల రేవంత్ రెడ్డి” పుస్తకాన్ని రచించగా.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఈ పుస్కకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రేవంత్ రెడ్డి విలక్షణమైన నాయకుడని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి.. తనదైన ముద్ర వేస్తూ.. డైనమిక్ లీడర్‌గా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బంధాలతో పాలన చేస్తున్న కేసీఆర్‌ మీద పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని తెలిపారు. తెలంగాణలో ఆనాడు ఉన్న పాసిస్టు పాలన గురించి ప్రజలకు వివరించి.. టీపీసీసీ అధ్యక్షుడిగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.

ఒకే ఒక్కడు పుస్తకాన్ని రచించిన వేణుగోపాల్ రెడ్డి, విజయార్కేకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి తరపున రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ కోరుకున్నారు. అంతేకాకుండా ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ANN TOP 10