రాజకీయాలకతీతంగా ప్రగతి
నేవీ రాడార్‌పై అపోహలు వద్దు
ఆ నేతల మాదిరిగా రాజకీయాలు చేయను
పూడూరులో నేవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన
రాజకీయాలకతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో భారత నేవీ ఏర్పాటు చేస్తున్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు కిషన్∙రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాడార్ స్టేషన్ కు భూమిపూజ చేసిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ భాగస్వామ్యం కీలకమన్నారు.
రాజకీయాలు చేయం..
‘హైదరాబాద్ దేశ రక్షణకు సంబంధించి కీలకమైన నగరం. రాడార్ స్టేషన్ తో అనర్థాలు జరుగుతాయని కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేశారు. కానీ తమిళనాడులో 34 ఏళ్లుగా ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దేశ రక్షణ కోసం రాజీపడొద్దనే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాం. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయం. కేంద్రంతో కలిసి నడుస్తాం. దేశ రక్షణ కోసం పెడుతున్న ప్రాజెక్టులపై రాజకీయం చేసేవారు పునరాలోచించుకోవాలి . రాడార్ స్టేషన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. దేశభద్రత చాలా ముఖ్యం. రాడార్ స్టేషన్ పై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. దేశ రక్షణకు సంబంధించిన విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదు. బీఆర్‌ఎస్ పదేళ్లు అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించిన అంశంలో కూడా బీఆర్‌ఎస్ నేతలు అవే అబద్దాలు చెబుతున్నారు’ అని సీఎం రేవంత్ విమర్శించారు.
మరో ముందడుగు..
తెలంగాణ రాష్ట్రం దేశ రచనలు మరో అడుగు ముందడుగు వేసింది. దేశ రక్షణలో ఇప్పటికే హైదరాబాద్ నగరం కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకోగా తెలంగాణకు మరో ఘనత దక్కింది. దేశంలోనే తొలి రాడార్ స్టేషన్ తమిళనాడులో ఉండగా.. రెండవ స్టేషన్ తెలంగాణలో ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
సీఎం సహకారం మరువలేనిది: రాజ్‌నాథ్
రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతోనే ఇక్కడ దేశంలోనే రెండవ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దేశ భద్రత విషయంలో నేవి కీలక పాత్ర పోషిస్తుందని.. ఇక్కడి రాడార్ స్టేషన్ నిర్మాణం ద్వారా సబ్ మెరైన్ లతో కమ్యూనికేషన్ బలపడుతుందన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు తగదని, సీఎం రేవంత్ రెడ్డి అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది అంటూ.. సీఎంకు అభినందనలు తెలిపారు కేంద్రమంత్రి.