తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ నేతలపై అటు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతూ.. న్యాయస్థానాల్లో పరువు నష్టం దావాలు దాఖలవుతూ.. యమా రంజుగా మారుతున్నాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల వ్యవహారం కోర్టుకు చేరగా.. టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగార్జునతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఈ వ్యవహారం ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేటీఆర్ మీద కేసు నమోదు చేశారు. అయితే.. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ చేపడుతోన్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో లక్షన్నర కోట్ల కుంభకోణం ఉందని.. అందులో రూ.25 వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారంటూ.. కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మురికి కూపంలో కూరుకుపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరించి.. హైదరాబాద్‌కు మరింత వన్నె తెస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్న విషయం తెలిసిందే. ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టనున్నట్టు గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తూ.. ఇందులో భారీ స్కాం ఉందంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూసీ ప్రాజెక్టును.. పరివాహక ప్రాంతాల్లోని నిర్వసితులంతా వ్యతిరేకిస్తున్నారు. తమ ఇండ్లను కూల్చేసి చేసే అభివృద్ధి మాకు అవసరం లేదంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే.. మూసీ నిర్వాసితులకు అండగా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ గళం వినిపిస్తోంది. ఘాటైన విమర్శలు గుప్పిస్తోంది. ఇదంతా ఇలా నడుస్తుంటే.. ప్రభుత్వం మాత్రం మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని.. ప్రతి నిర్వాసితునికి న్యాయం చేస్తామంటూ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ కూడా వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే.. ప్రభుత్వాన్ని తన విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కేటీఆర్ మీద ఇప్పుడు కేసు నమోదవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.