టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. కేంద్రం తరఫున హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంచారు. సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు రతన్ టాటాకు కడసారి నివాళులర్పించారు. సాయంత్రం 4 గంటలకు రతన్ టాటా భౌతిక కాయాన్ని ఎన్‌సీపీఏ నుంచి అంతిమ యాత్రగా వర్లి శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురు ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొని రతన్ టాటాకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.