యావత్ తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె నుంచి పట్నం వరకు వాడలన్నీ పూలవనాలుగా మారాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఉయ్యాల పాటలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొన్నది. ఈ నెల 2న ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు.. సద్దులతో ముగిశాయి. పూలనే పూజించే పండుగలో రాష్ట్రంలోని ఆడపడుచులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం గ్రామ, వార్డు కూడళ్లలోకి తీసుకొచ్చి ఉయ్యాల పాటలు పాడారు.
పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ ఆటలాడారు. ఇక హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వ అధికారికంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. సీఎంతో పాటు పలువురు మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మలతో శోభాయాత్ర అనంతరం క్రాకర్, లేజర్ షో ఏర్పాటు చేయగా.. అందరినీ అలరించింది. మరో వైపు హన్మకొండలోని పద్మాక్షి అమ్మవారి ఆలయం మహిళలతో కిక్కిరిసిపోయింది. బతుకమ్మలతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఆటలాడారు. చివరకు బతుకమ్మలను చెరువులు, నదులతో పాటు బతుకమ్మ ఘాట్లలో నిమజ్జనం చేసి వెళ్లిరా గౌరమ్మను సాగనంపారు. ఆ తర్వాత మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సిద్దిపేటలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.