నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనని.. వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని కట్టడాలు కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తుందని కితాబిచ్చారని.. ఇప్పుడేమో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామని ఆయన తెలిపారు.
అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతమయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అమీన్‌పూర్‌లో ఒక ఆస్పత్రిపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నా.. మళ్లీ నిర్మించారన్నారు. ఆ ఆస్పత్రిని కూల్చిన సమయంలో అందులో రోగులెవరూ లేరని చెప్పారు. కూల్చివేతను రికార్డు కూడా చేశామని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని, అయితే, దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదని తెలిపారు.
ప్రజలు నివసిస్తున్న భవనాలను ఎక్కడా కూల్చలేదని రంగనాథ్ చెప్పారు. ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయడం లేదని.. సరైన సమయం ఇచ్చిన తర్వాతే కూల్చివేస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవల కూకట్‌పల్లి నల్ల చెరువులో ఆక్రమణలు కూల్చివేశామన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు చెరువులు ఆక్రమించరని తెలిపారు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారని రంగనాథ్ చెప్పారు.