AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైడ్రా కారణంగా నిద్ర, ప్రశాంతత లేదు.. మాజీమంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆందోళన

హైదరాబాద్‌లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా హైడ్రా బుల్డోజర్లు వచ్చి.. భవనాలు నేలమట్టం చేస్తాయో తెలియక నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక కొందరికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేస్తుండగా.. మరికొందరికి మాత్రం నోటీసులు లేకుండానే కట్టుబట్టలతో బయటికి పంపించి కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలోనే మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు వచ్చినప్పటి నుంచి తనకు ప్రశాంతత, నిద్ర లేవని తాజాగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకున్న మల్లారెడ్డికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి, వేదఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి.. హైడ్రా వల్ల ప్రశాంతత లేదు.. నిద్ర లేదని చెప్పారు. హైడ్రా అధికారుల నుంచి తన కాలేజీలకు నోటీసులు వచ్చాయని.. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందోనని ఆందోళన చెందాల్సి వస్తోందన్నారు. అయితే తనకు ఉన్న విద్యాసంస్థలు మొత్తం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నిర్మించానని చెప్పారు. అప్పుడు కట్టిన కాలేజీలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు.

ప్రజల ఇళ్లను కూల్చి వారిని రోడ్డు మీద పడేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదని మల్లారెడ్డి హితవు పలికారు. తెలంగాణలో ప్రజలను హైడ్రా.. నానా హైరానాకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి సర్కార్.. హైడ్రాను ప్రయోగిస్తోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇళ్లను కూల్చివేసి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. కూల్చివేతలు ఆపి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏదో యుద్ధం చేసినట్లుగా హైదరాబాద్‌లో ఇళ్లను కూల్చివేస్తున్నారని మల్లారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను ఓ సవాల్ చేస్తున్నానని.. కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఇప్పుడు ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ నేతలకు వాళ్లకు తాను పాలాభిషేకం చేస్తానని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతు భరోసా లేదని, రుణమాఫీ పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సహజమేనని.. మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదని మల్లారెడ్డి ఆరోపించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10