బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం..
నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ
(అమ్మన్యూస్, బెంగళూరు):
బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించి మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మంది నిందితులను చేర్చారు. ఈ కేసుకు సంబంధించి బెంగళూర్ పోలీసులు 1,086 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఇందులో హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నారంటూ పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం బెంగుళూరు రేవ్ పార్టీ అంటూ ఓ రేంజ్లో హడావుడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ సేవించినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని, తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది.
నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ
రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ఛార్జిషీట్ తనకు వచ్చాక దీనిపై స్పందిస్తానని అన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్‌లో నెగిటివ్ అని ఛార్జిషీట్లో వేసినట్లు తెలుస్తుందని అన్నారు.