AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పురిటి నొప్పులని డాక్టర్లకు షాక్ ఇచ్చిన ‘గర్భిణి’.. ఆస్పత్రి బాత్రూంలో ట్విస్ట్

అత్తింటి వారి ఒత్తిడి భరించలేక గర్భం దాల్చినట్టు అబద్ధం చెప్పింది. నెలల తరబడి ఇటు పుట్టింటి వారినీ, అటు అత్తింటి వారినీ నమ్మించింది. 9 నెలల వరకూ బాగానే మేనేజ్ చేసింది. చివరికి నెలలు నిండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రం ఆసుపత్రికి చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జనగామ జిల్లా పాలకుర్తి మండలం మొండ్రాయి తండాకు చెందిన ఓ గిరిజన మహిళ 6 నెలల కిందట తాను గర్భం దాల్చినట్లు చెప్పింది. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చిందంటూ భర్తతో పాటు ఇరు కుటుంబాల వారిని నమ్మిస్తున్న ఆ మహిళకు చివరికి డెలివరీ టైమ్ రానే వచ్చింది. ఇరుగుపొరుగు మహిళలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో.. బుధవారం (సెప్టెంబర్ 11) ఉదయం నొప్పులు వస్తున్నాయంటూ కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో ఆమెను జనగామ మాతా శిశు ఆస్పత్రిలో చేర్పించారు.

బంధువులు వైద్యులతో మాట్లాడుతూ ఉండగా.. వాష్‌రూమ్‌కు వెళ్లొస్తా అంటూ వార్డు నుంచి వెళ్లిపోయింది సదరు వివాహిత. అర గంట గడిచింది. కుటుంబసభ్యులు ఆందోళన చెందుతుండగా.. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆ మహిళ.. తనకు బాత్రూమ్‌లోనే డెలివరీ అయిందని, శిశువు డ్రైనేజీలో పడిపోయిందని చెప్పింది.

బాత్రూమ్ పరిసరాల్లో ఆసుపత్రి సిబ్బంది ఎంత వెతికిన అలాంటి ఆనవాళ్లేమీ కనిపించలేదు. చివరకు అనుమానంతో ఆమెను తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అసలు గర్భవతే కాదని తేల్చారు. ఆ వార్త విని కుటుంబసభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందరినీ నమ్మించి మోసం చేసిన ఆమెను బూతులు తిట్టారు. వ్యవహారం తేడా కొట్టడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సదరు మహిళను స్టేషన్‌కు తరలించి ప్రశ్నించారు పోలీసులు. ఇంకా ప్రెగ్నెన్సీ రావడంలేదని అత్తింటి వారి నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక ప్రెగ్నెన్సీ నాటకం ఆడినట్టుగా పోలీసుల విచారణలో ఆ మహిళ అంగీకరించింది. పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.

ANN TOP 10