అక్రమార్కుల భరతం పట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్ల డిమాండ్
కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేత
అమ్మన్యూస్, ఆదిలాబాద్ :
హైడ్రా ద్వారా అక్రమార్కుల భరతం పట్టాలని, మున్సిపల్ పరిధిలోని లీజు స్థలాలను పరిరక్షించడంతోపాటు కబ్జాకు గురైనవాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం ఆవరణలో కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతిపత్రం అందజేశారు.
జిల్లాకు హైడ్రాను విస్తరింపజేసి చెరువులు, కుంటలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని, బఫర్ జోన్ పరిధిలో జరుగుతున్న కట్టడాలను ఆపాలని కోరారు. త్వరలో జరిగే హైడ్రా జిల్లాస్థాయి సమావేశంలో ఆక్రమణలు ,అక్రమ లేఅవుట్‌లు, పార్కింగ్ స్థలాలు , ప్రభుత్వ స్థలాలపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా 49 వార్డులలో జరిగే ప్రభుత్వ ఆస్తులు, పార్కింగ్, లీజు స్థలాల ఆక్రమణలపై ప్రజలు నిష్పక్షపాతంగా, ధైర్యంగా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. అదేవిధంగా బ్లాక్ మెయిలర్లపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.