చెరువుల పరిరక్షణ మహానగరానికి కీలకం
రాజకీయాలకు సంబంధంలేదు
అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే.
సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎవరినీ వదలిలే ప్రసక్తేలేదని, బెదిరేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగరంలో చెరువుల పరిరక్షణ ఎంతో కీలకమన్నారు. చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవర్నీ వదలమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రాంతంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మితమైన అక్రమ కట్టడాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో పలు వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తుండగా.. పలువురు ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ను లేక్ సిటీగా వందేళ్ల క్రితమే నిర్మించారని, అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే. హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
చెరువుల పరిరక్షణ ముఖ్యం..
‘నగరంలో చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవర్నీ వదలం. ఈ అంశంలో రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు ఈ చెరువులను సురక్షితంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మనమీద ప్రకోపిస్తుంది. చెన్నైలో ఇదే పరిస్థితి చూశాం. ఉత్తరాఖండ్ లో, కేరళలోకూడా చూశాం.. ఇలాంటివి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సుందరమైన నగరం. ఈ నగరానికి చెరువులే అందం. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఎవరెన్ని అనుకున్నా.. ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా.. వాటన్నింటిని పక్కనపెట్టి చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.