హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల అంతుచూస్తోంది. సామాన్యుడైనా, వీఐపీ అయినా… అందరికి ఒకే రూల్ అంటూ దూసుకెళ్తోంది. అందులోభాగంగానే… నటుడు నాగార్జునకి చెందిన మాదాపూర్‌లో ఉన్న ఎన్-కన్వెన్షన్ హాల్‌ను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. తమ్మిడికుంట చెరువుపై అక్రమంగా నిర్మించారని పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో… యాక్షన్ తీసుకున్నారు. కన్వెన్షన్ హాల్‌ను కూల్చొద్దంటూ నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా… జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక తుమ్మడికుంటపై 2014లో హెచ్ఎండీఏ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ తర్వాత ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లిందని.. దానిపై స్పందించిన కోర్టు.. చట్టబద్ధంగా ఉండాలని గతంలోనే ఆదేశించనట్లు రంగనాథ్ చెప్పారు. 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండింగ్‌లో ఉందని, ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏ కోర్టు కూడా స్టే ఇవ్వలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.