AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వయనాడ్‌లో రాహుల్ గాంధీ భావోద్వేగం

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలను, బాధితులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ ఇక్కడి పరిస్ధితి చూస్తుంటే తన తండ్రి మరణించిన సమయంలో తాను పడిన వేదనను అనుభవిస్తున్నానని అన్నారు.

ఇక్కడి ప్రజలు కేవలం వారి తండ్రినే కాదు మొత్తం కుటుంబాన్నే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరి పట్ల మనం సానుభూతి చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ యావత్‌ దేశం వయనాద్‌పై దృష్టి సారించిందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇక ప్రియాంక గాంధీ మాట్లాడుతూ తాము బాధితులను కలిసి వారితో రోజంతా గడిపామని, ఇది మాటలకు అందని మహా విషాదమని చెప్పారు.

ప్రజల బాధలను చూసి చలించిపోయామని, ఇక్కడి పరిస్ధితి చూస్తుంటే వారెంతగా నలిగిపోయారో మనం ఊహించవచ్చని వ్యాఖ్యానించారు. బాధితులకు భరోసా, ధైర్యాన్ని ఇచ్చేందుకే తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ విపత్తు సంభవించిందని అన్నారు. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులను ఎలా ఆదుకోవాలనే దానిపై తాము శుక్రవారం కూలంకషంగా చర్చిస్తామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

ఇక కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 288కి చేరుకుంది. అయితే ప్రమాదానికి కేంద్ర స్థాన‌మైన చూర్‌మ‌లాలో అంతకుముందు గురువారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ప‌ర్యటించారు. బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. మెప్పాడిలో క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌లో బాధితుల‌ను క‌లుసుకున్నారు. అక్కడ నుంచి డాక్టర్‌ మూపెన్స్ మెడిక‌ల్ కాలేజీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన రెండు రిలీఫ్ క్యాంప్‌లను సందర్శించి బాధితులను పరామర్శించారు. రాహుల్‌, ప్రియాంకల‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యద‌ర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.

ANN TOP 10