తెలంగాణలో మళ్లీ బుల్లెట్లు పేలాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో తుపాకీ తూటాలు మోతమోగాయి. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ నక్సల్ నేలకొరిగాడు. గురువారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించగా ఓ మావోయిస్టు మృతదేహం లభించింది. తర్వాత మృతుడిని విజేందర్ అలియాస్ నల్లమరి అశోక్‌గా పోలీసులు గుర్తించారు.
మావోయిస్టు పార్టీ ప్లీనరీ జరుగుతున్నదనే సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. స్పెషల్ పోలీసులు గురువారం తెల్లవారుజామున ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఉభయ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. ఆ డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన విజేందర్ అలియాస్ నల్లమరి అశోక్(40)గా మృతుడిని పోలీసులు గుర్తించారు. అయితే, తండ్రి సంవత్సరీకం రోజే అశోక్ మరణించారు. దీంతో ఆ గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక మావోయిస్టు అశోక్ పై రూ. 1 లక్ష రివార్డు ఉన్నది.









