AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇండియా కూటమిలోకి వైసీపీ…?… సజ్జల ఏమన్నారంటే…!

ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలోని పలు పార్టీలు మద్దతు పలికాయి. ఏపీలో జరుగుతున్న హింసను ఖండిస్తున్నామని, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు జగన్ వెంట నిలుస్తాయని శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రకటించారు. దాంతో, వైసీపీ ఇండియా కూటమిలో చేరనుందా? అనే ప్రచారం మొదలైంది. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

వైసీపీ ఒక బలమైన పార్టీ అని, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అన్నట్టుగా పొత్తు పెట్టుకోకూడదన్నది జగన్ సిద్ధాంతం అని వెల్లడించారు. పన్నెండేళ్లుగా ఆ సిద్ధాంతం ప్రకారమే పార్టీని నడిపిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని సజ్జల చెప్పారు.

“ఈ అంశం అన్ని పార్టీలకు సంబంధించినది. మా ఒక్క పార్టీకే సంబంధించింది కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూపంలో ఉండొచ్చు. ఇతర పార్టీకి ఇబ్బంది వచ్చినప్పుడు మా పార్టీ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తుంది. రాజకీయ హింసను తప్పకుండా ఖండిస్తాం. ఈ అంశం ప్రాతిపదిక మీదనే ఢిల్లీలో ధర్నాకు అందరినీ ఆహ్వానించాం. వాళ్లు కూడా ఆ కోణంలోనూ చూసి మాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చారని అనుకుంటున్నాం. ఇలాంటి సంక్షోభాలు ఎప్పుడు వచ్చినా అందరం కలుస్తాం.

ధర్నాకు రావాలని మేం బీజేపీ, కాంగ్రెస్ లను కూడా కలిశాం. ఖర్గే, నడ్డాలను కలిసి ఆహ్వానించడం జరిగింది. రాగలిగిన పార్టీలు వచ్చాయి. రాజకీయ దృష్టితో చూసినవాళ్లు రాలేదు. వాళ్ల పరిమితులు ఏమున్నాయో మాకు తెలియదు. ఈ అంశాన్ని చూసి, దీన్ని ఖండించాలి అనుకునేవారు వచ్చారు… అందుకు మాకు సంతోషం. భవిష్యత్తులో ఇలాంటివి సంభవించినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే వీటిని ఆపొచ్చు.

ఎన్నికల అనంతరం ఈ విధంగా హింస చోటుచేసుకోవడం చరిత్రలో ఇంతకుముందెప్పుడూ జరగలేదు. కౌంటింగ్ తర్వాత టీడీపీ ప్రణాళిక ప్రకారం దాడులు చేసింది. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయింది. మా పార్టీ కార్యకర్తలపై, మా పార్టీ సానుభూతి పరులపై రాజకీయ దాడులు జరిగాయి. మాకు ఓటేసిన సామాన్య ప్రజలపై కూడా దాడులు చేసే పరిస్థితి వచ్చింది.

దాడులు తీవ్రరూపం దాల్చడంతో గవర్నర్ ను ఒకట్రెండు సార్లు కలిశాం. ఇది మంచి సంస్కృతి కాదని టీడీపీ వాళ్లకు కూడా విజ్ఞప్తి చేశాం. ఇటువంటి వాటికి బీజం వేస్తే, భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆందోళన వ్యక్తం చేశాం. కానీ వాళ్లు (టీడీపీ) వినలేదు. ఒకసారి జాతీయ స్థాయిలో అందరికీ వివరించాలనే ఢిల్లీలో నిరసన చేపట్టామని సజ్జల అన్నారు.

ANN TOP 10