AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్ర ఆదాయం పెంచాలి..! అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశం..!

రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌ఎడ్డి అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను తయారు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని సూచించారు. ఆదాయం తెచ్చి పెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని సూచించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునరవ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్‌ శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశంలో వివిధ అంశాలను చర్చించారు. వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం పేర్కొన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మంత్లీ టార్గెట్‌ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

ఇకపై ప్రతినెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తానే స్వయంగా సమీక్షిస్తానని చెప్పారు. నెలవారీ సమీక్షతో పాటు ప్రతి శుక్రవారం ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీ ఆదాయం పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించొద్దన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై వాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా ఏవియేషన్‌ ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించారు.

ANN TOP 10