AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమ్మమాట-అంగన్‌వాడీ బాట పేరుతో ప్రత్యేక డ్రైవ్‌.. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క

అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులను ప్రారంభించబోతున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆ కేంద్రాలకు వచ్చే పిల్లలకు యూనిఫారాలు అందజేస్తామన్నారు. ఈ నెల 15 నుంచి వారంపాటు అమ్మమాట-అంగన్‌వాడీ బాట పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఆ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. పౌష్టికాహార తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతా ధికారులతో కలిసి జిల్లా సంక్షేమ అధికారులు, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్‌ కేర్‌ వంటి అంశాలపై చర్చించారు. అమ్మమాట-అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని సీతక్క సచివాలయంలో ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీతక్క మాట్లాడుతూ..పిల్లలకు తొలి ఒడి అమ్మ అయితే మలిఒడి అంగన్‌వాడీ కేంద్రాలేనని చెప్పారు. కేంద్రాల్లో ఇస్తున్న సరుకులు, సేవల నాణ్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్ల సరఫరా కట్టడి విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలనీ, ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు వారానికో ప్రాంతంలో పర్యటించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. పేద పిల్లలకు పౌష్టికాహారం, విద్య, భద్రత అందేలా చూడాలన్నారు. అమ్మ స్థానంలో ఉన్న అంగన్‌వాడీ సిబ్బంది..పిల్లలకు అమ్మ ప్రేమను పంచేలా చూడాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలు నిలవాలని ఆకాంక్షించారు. కేంద్రాలకు పెయింటింగ్‌ పనులు పూర్తిచేయించాలని ఆదేశించారు. చాటు మాటుగా దత్తత తీసుకుని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా నిబంధనలకు అనుగుణంగా పిల్లలను త్వరితగతిన దత్తత తీసుకునేలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరే విధంగా ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ANN TOP 10