AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మమతా బెనర్జీకి భారీ షాక్.. పార్టీకి బెంగాల్ అధ్యక్షురాలు రాజీనామా..

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన సీనియర్ నాయకురాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు. శనివారం ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేవలం రాష్ట్ర అధ్యక్ష పదవికే కాకుండా, పార్టీ బ్యాంకు ఖాతాల ఆథరైజ్డ్ సిగ్నేచరీగా, ఎన్నికల సంఘం వద్ద పార్టీ ప్రతినిధిగా కూడా తన బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నారు.

 

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ ఆరంభంలో మమతా బెనర్జీ పాత కమిటీలను రద్దు చేసి, చంద్రిమను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. అయితే, బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. తన రాజీనామా లేఖలో మమతా బెనర్జీ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చంద్రిమ పేర్కొన్నారు.

 

ప్రస్తుతం టీఎంసీలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులైన రితబ్రత బెనర్జీ వర్గంతో మెజారిటీ ఎమ్మెల్యేలు చేతులు కలిపారు. తన రాజీనామాను సమర్పించిన వెంటనే చంద్రిమ భట్టాచార్య అసెంబ్లీలో రెబల్ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో సుమారు 20 మంది ఎన్డీఏకు మద్దతిస్తున్న మరో పార్టీలో విలీనమయ్యారు.

 

చంద్రిమ రాజీనామాపై మమత బెనర్జీ వర్గం నేతలు స్పందించారు. పార్టీలో కీలక పదవులను అనుభవించి, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరైనది కాదని ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిప్రాయపడ్డారు. టీఎంసీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోందనడానికి ఇదే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వ్యాఖ్యానించారు

ANN TOP 10