పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతాయని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచడానికి ఆమోదం తెలిపారని రిజిజు వివరించారు. మొత్తం నాలుగు వారాల పాటు జరిగే ఈ సెషన్‌లో 19 రోజుల పాటు సభా కార్యకలాపాలు జరగనున్నాయి.
ఈసారి వర్షాకాల సమావేశాలు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమిలో నెలకొన్న విభేదాలు, అధికార ఎన్డీయే బలాన్ని పెంచే పరిణామాలు ఈ సెషన్‌పై ప్రభావం చూపనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది రెబల్ ఎంపీలు ఎన్‌సీపీఐలో విలీనం కావడం, ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం వంటి అంశాలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పరిణామాలతో పార్లమెంటులో ఎన్డీయే బలం మరింత పెరగనుండగా, విపక్ష ‘ఇండియా’ కూటమి బలహీనపడనుందని అంచనాలు వెలువడుతున్నాయి.
మరోవైపు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకోవడంతో డీఎంకే తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు కాంగ్రెస్ సభ్యులతో సంబంధం లేకుండా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కోరుతూ డీఎంకే ఇప్పటికే స్పీకర్‌కు లేఖ రాసింది. ఈ పరిణామాలన్నీ సభలో ప్రతిపక్షాల ఐక్యతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
ప్రభుత్వ అజెండాలో కీలక బిల్లులు
ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత సమావేశాల్లో తిరస్కరణకు గురైన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఈసారి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు వరుసగా 30 రోజులకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే వారి పదవులు వాటంతట అవే రద్దయ్యేలా నిబంధనలు తీసుకొచ్చే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ బిల్లు కూడా కేంద్రం అజెండాలో ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు, యాంటీ-డోపింగ్ బిల్లులను కూడా సభ ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ఆర్డినెన్స్ స్థానంలో కొత్త బిల్లుతో పాటు వేతన నియమావళి, కార్పొరేట్ లా, సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్‌లకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు చట్ట సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.








